
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిల్లీలో సమావేశమైంది. గతంలో సోనియా లేదా రాహుల్ గాంధీ మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టేవారు కనుక అధ్యక్షుడి ఎన్నిక లాంఛనప్రాయంగా సాగేది. కానీ ఈసారి వారిరువురూ అధ్యక్ష పదవి చేపట్టడానికి నిరాకరిస్తుండటమే కాక ఆ ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా నిరాకరిస్తున్నారు. దాంతో పార్టీలో అందరికీ ఆమోదయోగ్యుడైన అధ్యక్షుడిని ఎన్నుకోవడం చాలా క్లిష్టంగా మారింది.
దీనికోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈసారి ఒక కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల పిసిసి అధ్యక్షులను, వర్కింగ్ ప్రెసిడెంట్లను, పార్టీలో ముఖ్యనేతలను 5 వర్గాలుగా విభజించి, వారితో సంప్రదింపుల కమిటీలు వేర్వేరుగా భేటీ అవుతూ వారి అభిప్రాయాలూ సేకరిస్తున్నాయి.
ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు సోనియా, రాహుల్ నిరాకరించి వర్కింగ్ కమిటీ సమావేశం మద్యలో లేచి వెళ్ళిపోయారు. ఈ ప్రక్రియలో తాము పాల్గొన్నట్లయితే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా అందరికీ ఆమోదయోగ్యుడైన అధ్యక్షుడిని ఎన్నుకోవడం కష్టం అవుతుందనే ఉద్దేశ్యంతో వారు వర్కింగ్ కమిటీకే పూర్తి బాధ్యత అప్పగించి వెళ్ళిపోయారు.
ప్రస్తుతం 5 కమిటీలు దేశంలో 5 ప్రాంతాల పార్టీల నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నాయి. కనుక అధ్యక్షుడి ఎన్నికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. బహుశః ఈరోజు సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నంలోగా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటించవచ్చు.