
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భీమా పధకాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 13వరకు పొడిగిస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 31.10 లక్షల మంది రైతులకు ఈ పధకాన్ని వర్తింపజేస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.3013.50 చొప్పున జీఎస్టీ, స్టాంప్ డ్యూటీలతో కలిపి మొత్తం రూ.934.19 కోట్లు ప్రీమియం ఎల్ఐసీ సంస్థకు చెల్లిస్తోంది. ఏ కారణం చేత రైతు చనిపోయినా అతను లేదా ఆమె కుటుంబానికి 10 రోజులలోపుగా ఎల్ఐసీ సంస్థ రూ.5 లక్షలు భీమా మొత్తాన్ని అందజేస్తోంది. దీని వలన ఆ రైతు కుటుంబం రోడ్డున పడకుండా కాపాడబడుతుంది. ఈ పధకం ప్రారంభించినప్పటి నుంచి కనుక రైతులకు ఇది చాలా మేలు కలిగించే పధకమే. దీనివలన రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా ఆర్ధికభారం పెరుగుతున్నప్పటికీ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆ భారాన్ని భరించడానికి సిద్దపడుతోంది.