
జమ్ముకశ్మీర్‌పై మోడీ ప్రభుత్వం చాలా సాహసోపేతంగా తీసుకున్న తాజా నిర్ణయాలు మన దేశంలోనే కాదు...పొరుగునే ఉన్న పాకిస్థాన్‌తో సహా పలుదేశాలలోను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా లోక్‌సభ సాక్షిగా మరో బాంబు పేల్చారు. తమ ప్రభుత్వం తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడమేనని ప్రకటించడంతో దేశంలో అందరూ ఉలిక్కిపడ్డారు. అమిత్ షా లోక్‌సభ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఏవిధంగా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు. ఆనాడు నెహ్రూ చేసిన పొరపాటు వలన చేజార్చుకున్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భవిష్యత్తులో మళ్ళీ స్వాధీనం చేసుకొని భారత్ చిత్రపటాన్ని సరిదిద్దుతాము. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా ఎన్నికలు నిర్వహిస్తాము,” అని తెలిపారు.
ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లోని పాలకులతో సహా పాక్ పాలకులు కశ్మీర్‌ను భారత్ చెర నుంచి విడిపించాలని కోరుతూ దశాబ్ధాలుగా భారత్‌తో అప్రకటితయుద్ధం చేస్తున్నారు. కానీ కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయడం కాదు... పాక్ ఆక్రమిత కశ్మీర్‌నే భారత్‌లో విలీనం చేసుకొంటామని కేంద్రహోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రకటించడం వేర్పాటువాదులకు, వారికి మద్దతు ఇస్తున్న జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలకు, ఆ పార్టీలకు గుడ్డిగా మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి, పాకిస్థాన్ పాలకులకు, వారి సైన్యాధికారులకు, వారి పెంపుడు జంతువుల వంటి ఉగ్రవాదులకు మింగుడుపడని విషయమే. ఇప్పటికే భారత్‌పై రంకెలు వేస్తున్న వారందరూ అమిత్ షా ప్రకటనతో షాక్‌కు గురయ్యుంటారని భావించవచ్చు.