
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కోట్లు విలువ చేసే ఖరీదైన భూములను తెలంగాణ ప్రభుత్వం తెరాసతో సహా వివిద రాజకీయ పార్టీలకు నామమాత్రపు ధరలు ముట్టజెప్పిందని ఆరోపిస్తూ కరీంనగర్‌లోని కోరుట్లపేటకు చెందిన మేడిపల్లి శ్యామ్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వాజ్యం వేశారు. జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం గజం కనీసం రూ.20,000లకు పైనే ఉందని, కానీ తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.100లకే గజం చొప్పున విలువైన ప్రభుత్వ భూములను సొంత పార్టీతో సహా ప్రతిపక్షపార్టీలకు కూడా ధారాదత్తం చేసిందని, ఇది రాజ్యాంగంలోని సెక్షన్ 14ను ఉల్లంఘించడమేనని పిటిషనర్ పేర్కొన్నారు.
ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తగా మాత్రమే వ్యవహరించవలసిన తెలంగాణ ప్రభుత్వం, తన పరిధిని అతిక్రమించి రాజకీయ పార్టీలకు కారుచవుకగా భూములు పంచిపెట్టడాన్ని పిటిషనర్ తప్పు పట్టారు. కనుక దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 66, 168ను రద్దు చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, రెవెన్యూశాఖ ప్రధానకార్యదర్శి, భూపరిపాలన శాఖ చీఫ్ కమీషనర్లను, తెరాసతో సహా భూములు పొందుతున్న అన్ని పార్టీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. త్వరలో ప్రతివాదులకు నోటీసులు పంపించే అవకాశం ఉంది.
ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చాలా ధనిక పార్టీలే. వాటిలో నేతల సంగతి సరేసరి. చాలామంది నేతలు ఎన్నికలలో కోట్లు వెదజల్లుతున్నవారే. కనుక పార్టీ కార్యాలయాల కోసం పార్టీల నేతలే విరాళాలు వేసుకొని మార్కెట్ ధరల ప్రకారం భూమి కొనుకోవచ్చు లేదా పార్టీ నేతలే తమ భూములను పార్టీకి విరాళంగా ఇచ్చి కార్యాలయాలు నిర్మించుకోవచ్చు. అలా చేస్తే ఎవరూ ఈవిధంగా వేలెత్తిచూపలేరు. కానీ ప్రభుత్వమే తమ సొంత పార్టీకి ప్రభుత్వభూములను పంచిపెట్టడాన్ని ఎవరూ హర్షించరు. రేపు న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టవచ్చు.
రాష్ట్రంలో పేదప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించడానికి మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం, తెరాస కార్యాలయాల కోసం ఒక్కో జిల్లా కేంద్రంలో ఎకరా భూమి కేటాయించుకోవడం చూసి ప్రజలు ముక్కునవేలేసుకొంటున్నారు. వాటిలో ఒక్కో భవనం నిర్మాణం కోసం సిఎం కేసీఆర్ రూ.60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ డబ్బు ప్రభుత్వ సొమ్మా లేక తెరాస పార్టీదా అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఐదున్నరేళ్లు గడిచిపోయినా ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తికాలేదు కానీ నెలరోజుల క్రితం 29 జిల్లాలలో మొదలుపెట్టిన తెరాస కార్యాలయభవనాలు ఈ దసరానాటికల్లా ప్రారంభోత్సవం చేయాలనే లక్ష్యంతో యుద్ధప్రాతిపాదికన శరవేగంగా పనులు జరిపిస్తుండటం విశేషం. అందుకే ఇటువంటి పిటిషను దాఖలవుతున్నాయని చెప్పుకోవచ్చు.