
తెలంగాణ ప్రభుత్వం కాస్త ముందుగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దపడినప్పటికీ, రిజర్వేషన్లు, వార్డుల విభజన, ఓటర్ల జాబితాలలో అవకతవకలు వంటి కారణాలతో ఎన్నికలు న్యాయవివాదాలలో చిక్కుకొన్నాయి. జూలై నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఆగస్ట్ నెలాఖరుకైనా నిర్వహించగలదో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మళ్ళీ నేడు విచారణ కొనసాగించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున వాదిస్తున్న న్యాయవాది విద్యాసాగర్, రాష్ట్రంలో 126 మున్సిపాలిటీలలో 69 మున్సిపాలిటీలపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని కనుక వాటిలో ఎన్నికలు నిర్వహించడానికి అనుమతించవలసిందిగా హైకోర్టును అభ్యర్ధించారు. ఈరోజు హైకోర్టు విచారణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొంత స్పష్టతవచ్చే అవకాశం ఉంది.