ట్రిపుల్‌ తలాక్‌పై జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు

కేంద్రప్రభుత్వం మోసపూరితంగా ట్రిపుల్‌ తలాక్‌ చట్టం తీసుకువచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి బిజెపికి తగినంత బలం లేకపోయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులలో చీలికలు తెచ్చి కేవలం 99 మంది సభ్యుల మద్దతుతో ట్రిపుల్‌ తలాక్‌ చట్టం తీసుకువచ్చిందని జీవన్‌రెడ్డి అన్నారు. దేశంలో ముస్లింల పట్ల నరేంద్రమోడీ ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌, కామన్ సివిల్ కోడ్ వంటివన్నీ అందుకు అద్దం పడుతున్నాయన్నారు. ముఖ్యంగా ట్రిపుల్‌ తలాక్‌ చట్టం తీసుకురావడం ముస్లింల మత వ్యవహారాలలో కలుగజేసుకోవడమేనని, అది ఇస్లాం మతాన్ని అవమానించడమే అవుతుందన్నారు. కేంద్రప్రభుత్వం చెపుతున్నట్లుగా ట్రిపుల్ తలాక్‌ విధానాన్ని ఏ దేశంలో నేరంగా పరిగణించడం లేదని కానీ మోడీ ప్రభుత్వం ఈ బిల్లుతో ముస్లింలను వేధించడానికి సిద్దం అవుతోందన్నారు. ఇకనైనా మోడీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌పై పునరాలోచన చేయాలని  విజ్ఞప్తి చేశారు.కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని చట్టాలు రూపొందించడం సరికాదన్నారు జీవన్‌రెడ్డి.

తాజా సమాచారం: పార్లమెంట్ ఆమోదించిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుదవారం సాయంత్రం ఆమోదముద్ర వేశారు. దీంతో అది చట్టరూపం దాల్చి అమలులోకి వచ్చింది.