సిఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

విద్యుత్ బిల్లుల చెల్లింపులపై సిఎం కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించవలసిన విద్యుత్ బకాయిలను అన్నిటినీ ఏకమొత్తంగా ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడాన్ని సిఎం కేసీఆర్‌ తప్పు పట్టారు. ఇకపై నెలనెలా బిల్లులు చెల్లించడం తప్పనిసరి చేస్తామని చెల్లించకపోతే సంబందిత అధికారులపై చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ బకాయిల సమస్యకు శాస్విత పరిష్కారంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రీ-పెయిడ్  ప్రీ-పెయిడ్ విద్యుత్ మీటర్లు అమర్చాలని విద్యుత్ శాఖ అధికారులను సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. అప్పుడు ముందుగా విద్యుత్ బిల్లు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది లేకుంటే నిలిచిపోతుందనే భయంతో నెలనెలా బిల్లులు చెల్లిస్తుంటారని సిఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. 

రాష్ట్ర ప్రగతి, గౌరవం విద్యుత్ సంస్థల మనుగడపైనే ఆధారపడి ఉందని కనుక వాటిని కాపాడుకొంటామని సిఎం కేసీఆర్‌ తెలిపారు. విద్యుత్ సంస్థలు అభివృద్ధి కోసం నిధుల సమీకరించుకోదలిస్తే రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందని సిఎం కేసీఆర్‌ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్ సరఫరా చేసే డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలబడుతుంది కనుక రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవలసిందిగా సిఎం కేసీఆర్‌ విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పధకానికి భారీగా విద్యుత్ అవసరం ఉంటుంది కనుక దానికోసం 1,000 మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి టెండర్లు పిలవాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

ప్రగతి భవన్‌లో బుదవారం సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన విద్యుత్ సమీక్షా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జెన్‌కో-ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, ఏ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.