నెలరోజులలో 50 లక్షల సభ్యత్వాలు...గ్రేట్

తెరాస జూన్ 27వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టింది. నేటికి అంటే జూలై 31వ తేదీ నాటికి  50 లక్షల మందిని  సభ్యులుగా చేర్చుకొని ఒక తెరాస ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది తెరాసకున్న ప్రజాధారణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీ కార్యనిర్వహణ, సమర్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి తెరాస రూ.2 లక్షల ప్రమాద భీమా అందజేస్తోంది. బహుశః అది కూడా చాలా మందిని ఆకర్షించి ఉండవచ్చు.

ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో బుదవారం పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి  మాట్లాడుతూ, “కేవలం నెలరోజులలో 50 లక్షల మంది తెరాస సభ్యులుగా చేరడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.  పార్టీలో సభ్యులుగా చేరిన ప్రతీ ఒక్కరికీ ప్రమాదభీమా కల్పిస్తాము. దీనికోసం యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇప్పటికే రూ.11.21 కోట్లు చెల్లించాము. రాష్ట్రంలో ప్రతిపక్షాలు తెరాసకు తామే ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకొంటున్నాయి. ఎవరి సత్తా ఎంతో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో తేలిపోతుంది. ఆ ఎన్నికలలోనే వారికి మనం మళ్ళీ సమాధానం చెపుదాము,”అని అన్నారు.