కొత్తగూడెంలో యుద్ధవాతావరణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల మండలం రోళ్ళగడ్డ గ్రామంలో సమీపంలో గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మద్య కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంది. పోలీసుల కాల్పులలో లింగయ్య దళానికి చెందిన ఒకరు మరణించగా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల వారోత్సవాలను దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించడంతో వారు గస్తీ తిరుగుతున్నప్పుడు లింగయ్య దళం సభ్యులు ఎదురుపడటంతో ఇరువర్గాల మద్య కాల్పులు మొదలయ్యాయి. లింగయ్య దళంతో పాటు న్యూడెమోక్రసీ అనే మరో దళానికి చెందిన సభ్యులు కూడా పోలీసులపై ఎదురుకాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న ఏడుగురు మావోయిస్టులను తక్షణం విడిచిపెట్టాలని కోరుతూ వారి సానుభూతిపరులు గుండాల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఇరువర్గాల మద్య కాల్పులు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది.