కాంగ్రెస్‌ నేత ముఖేష్ గౌడ్ మృతి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుసగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకపక్క సీనియర్ కాంగ్రెస్‌ నేత జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతుండగానే మరో సీనియర్ నేత ముఖేష్ గౌడ్ (60) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కొంతకాలంపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకొన్నారు. కానీ ఆయన కోలుకునే అవకాశం లేదంటూ కొన్ని రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించివేశారు. ఆదివారం రాత్రి మళ్ళీ ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమించిందని వైద్యులు తెలిపారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. 

గతంలో గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన, దివంగత రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు. 2018 ముందస్తు ఎన్నికలలో కూడా పోటీ చేశారు కానీ అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారం చేసుకోలేక ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో  రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.