కాంగ్రెస్‌ నేత జైపాల్ రెడ్డి ఇక లేరు

మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్‌ నేత ఎస్.జైపాల్ రెడ్డి (77) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియా జ్వరంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఈరోజు తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహానికి తరలించారు.      

జైపాల్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మాడుగలలో సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు 1942, జనవరి 16న జన్మించారు. ఆయనకు బాల్యంలోనే పోలియో వ్యాది సోకడంతో అంగవైకల్యం పొందారు. కానీ ఏనాడూ నిరాశానిస్పృహలకు లోనవకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకోవడమే కాకుండా వేలాదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. 

ఆయన నల్గొండ జిల్లా దేవరకొండలో విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. విద్యార్ది దశ నుంచే నాయకత్వ లక్షణాలు కనబరిచిన జైపాల్ రెడ్డి, 1969లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు ఆయన కల్వకుర్తి నుంచి గెలిచారు. కానీ 1977లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జన్సీ పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ను వీడి జనతాపార్టీలో చేరారు. 1980లో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ళ తరువాత మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకుని అప్పటి నుంచి తుది శ్వాస విడిచేవరకు పార్టీలోనే కొనసాగారు. 

1999లో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు. వివిద అంశాలపై పార్లమెంటులో ఆయన చేసిన అద్భుత ప్రసంగాలు, ఆయనకు కేంద్రమంత్రి పదవులను, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును సంపాదించి పెట్టాయి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా, దివంగత ప్రధాని ఐకె గుజ్రాల్ మంత్రివర్గంలో సమాచారశాఖ మంత్రిగా, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.   

ఇవన్నీ ఒక ఎత్తైతే, కేంద్రమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన అందించిన సహకారం ఒక్కటీ ఒక ఎత్తని చెప్పవచ్చు. అదే ఆయన జీవితానికి సార్ధకతను కలిగించిందని చెప్పవచ్చు. ఆనాడు ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, తోటి కేంద్రమంత్రులను, ప్రధాన ప్రతిపక్షమైన ఎన్డీయే (బిజెపి), వామపక్ష నేతలను అందరితో మాట్లాడి తెలంగాణ ఏర్పాటుకు మద్దతు కూడగట్టారు. అదేవిధంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు దానికి ఆమోదముద్ర పడేందుకు జైపాల్ రెడ్డి తెర వెనుక చాలా కీలకపాత్ర పోషించారు. కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను ఎవరూ విస్మరించలేరు. 

ఆయన మృతిపట్ల పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జైపాల్ రెడ్డి చేసిన కృషిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయన అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరిపించాలని, దాని కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తే బాగుంటుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్ధనపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం లేదా రేపు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించవచ్చు.