రెండో స్థానం కోసం కాంగ్రెస్‌, బిజెపిల కీచులాటలు!

కాంగ్రెస్‌, బిజెపి రెండూ జాతీయ పార్టీలు. కనుక ప్రాంతీయ పార్టీలు వాటితో పోటీ పడాలి కానీ తెలంగాణలో ఆ రెండు పార్టీలు తెరాసతో పోటీ పడుతున్నాయి. మళ్ళీ రెండవ స్థానం కోసం వాటిలో అవి పోటీ పడుతుండటం విశేషం. 

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, బిజెపి, తెరాసలు రెండూ పైకి శత్రువులవలె నటిస్తున్నప్పటికీ రెంటి మద్య నేటికీ రహస్య అవగాహన ఉందని ఆరోపించారు. పార్లమెంటులో ఆర్టీఐ బిల్లును మొదట వ్యతిరేకించిన తెరాస, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిఎం కేసీఆర్‌కు ఫోన్ చేయగానే హుటాహుటిన తెరాస ఎంపీ సంతోష్ కుమార్‌ను విమానంలో డిల్లీకి పంపించి మద్దతు ఇచ్చిందని, ఇదే ఆ రెండు పార్టీల మద్య అనుబందానికి తాజా నిదర్శనమని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెరాసకు మేమే ప్రత్యామ్నాయమని గొప్పలు చెప్పుకొంటున్న బిజెపి నేతలు మళ్ళీ అదే తెరాస సాయం ఎందుకు కోరవలసి వచ్చిందని ప్రశ్నించారు. అవసరమైనప్పుడు తెరాస సాయం పొందుతూ దానిని ఏవిధంగా ఎదుర్కోగలమని భావిస్తున్నారని ప్రశ్నించారు. బిజెపి-తెరాసల మద్య లోపాయికారి సబందాలు కొనసాగుతున్నప్పుడు బిజెపిలో చేరిన డికె.అరుణ, పొంగులేటి తదితర నేతలకు సిఎం కేసీఆర్‌ను ఎదిరించి మాట్లాడే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయే తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని రేవంత్‌ రెడ్డి అన్నారు. 

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై డికె.అరుణ, పొంగులేటి తీవ్రంగా స్పందించారు. “రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల భవిష్యత్ నానాటికీ ఆగమ్యగోచరంగా మారుతుండటంతో వారికి ఏమి మాట్లాడాలో తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలే తెరాసతో లోపాయికారి ఒప్పందం చేసుకొని పార్టీని నాశనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని ఏవిధంగా గెలిపించుకోవాలని ఆలోచించాల్సిన కుంతియా ఒక్కో టికెట్ కు ఎంత సొమ్ము వసూలు చేసుకోవాలని ఆలోచించారు. టికెట్లు అమ్ముకున్న కుంతియా వంటి నేతల కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యిందనే సంగతి పార్టీలో అందరికీ తెలుసు. దేశప్రజలు ప్రధాని నరేంద్రమోడీని అఖండ మెజార్టీతో గెలిపించడంతో సిఎం కేసీఆర్‌ నోట మాట రావడం లేదిప్పుడు,” అని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. 

డికె.అరుణ మాట్లాడుతూ, “గతంలో యూపీయే ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు దానికి బిజెపి మద్దతు ఇచ్చింది కదా? అలాగే మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టి బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు పలికింది కదా? కీలకమైన బిల్లులకు కేంద్రం ప్రతిపక్షాల మద్దతు కోరడం సహజమే. ఆవిధంగానే ఆర్టీఐ బిల్లుకు కేంద్రం తెరాస మద్దతు కోరగా తెరాస మద్దతు ఇచ్చింది. అంతమాత్రన్న బిజెపి-తెరాసలకు సంబందం అంటగట్టడం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీయే తెరాసతో కుమ్మక్కు అయ్యింది కనుక అది ఎన్నటికీ తెరాసతో పోరాడలేదు. తెరాసకు ప్రత్యామ్నాయం కాలేదు. బిజెపి మాత్రమే తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాగలదు,” అని అన్నారు.