
పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే జిల్లాలో రూ.300 కోట్లు పెట్టుబడితో ఒక ఫార్మసీ సంస్థ ఏర్పాటుకాబోతోందని తెలిపారు. అయితే అది పూర్తి విభిన్నమైన పద్దతిలో మందులను తయారుచేస్తుంది. ఒక ప్రత్యేకరకమైన మిర్చి నుంచి క్యాన్సర్ నిరోధక మందులను దానిలో ఉత్పత్తి చేస్తారని తెలిపారు. దానికోసం ఆ ప్రాంతంలో అటువంటి ప్రత్యేకరకమైయన్ మిరపకాయలను పండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 29 ఎకరాల భూమిని కూడా కేటాయించిందని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. త్వరలోనే ఫార్మసీ సంస్థ నిర్మాణ పనులు మొదలవుతాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకువచ్చి జిల్లాలోని చెరువులన్నీ నింపుతామని చెప్పారు. ఒకప్పుడు డివిజన్ కేంద్రంగా ఉండే మహబూబాబాద్‌కు కేసీఆర్ జిల్లా హోదా కల్పించి అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నారని అన్నారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఒక రైతుబజార్, వైద్యకళాశాల, ఒక ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.