
రాష్ట్ర ప్రభుత్వం రూందించిన కొత్త పురపాలక చట్టంలో పురపాలకమండలి బోర్డుకు మూడేళ్ళు పూర్తయ్యే వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదనే నిబందన విధించారు. ఇప్పుడు ఆ నిబందనే ఖమ్మం మేయర్ గోగులోత్ పాపాలాల్ పదవికి ఎసరు తెస్తోంది. ఆయనకు మూడేళ్ళ పదవీకాలం ముగిసింది గాబట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి తెరాసకు చెందిన 43 మందిలో 37మంది కార్పొరేటర్లు సిద్దం అవుతున్నారు. వారందరూ డెప్యూటీ మేయర్ బత్తుల మురళి నివాసంలో రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్ పాపాలాల్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చునని భావిస్తున్న వారందరూ దానిపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. వారికి మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా మద్దతు పలికినట్లు సమాచారం. త్వరలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ కొత్త చట్టంలో నిబందనల ప్రకారం వీలుకాకుంటే మేయరును పదవిలో నుంచి తొలగించాలని వారు జిల్లా కలెక్టరును కోరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.