కేసీఆర్‌ నేనే రాజు...నేనే మంత్రి...

బిజెపి నేత డికె.అరుణ గురువారం మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెరాసకు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. రాష్ట్రప్రజలకు కూడా ఇప్పుడు బిజెపిపై నమ్మకం ఏర్పడింది. అయితే రాష్ట్ర బిజెపిలో ఇంకా చాలా మార్పులు రావలసిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికలలోగా బిజెపిని బలోపేతం చేసుకొని తెరాసను ఎదుర్కొంటాము. సిఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ పాలన సాగిస్తున్న తీరుచూస్తుంటే ‘నేనే రాజు నేనే మంత్రి’ అన్నట్లు పాలన సాగుతున్నట్లనిపిస్తోంది. చింతమడక సభలో సిఎం కేసీఆర్‌ హరీష్‌రావును నోరారా పొగిడినప్పటికీ ఆయనను రాజకీయంగా దెబ్బ తీయడానికే చింతమడకకు అంత ఉదారంగా వరాలు ప్రకటించారని భావిస్తున్నాను,” అని విమర్శలు గుప్పించారు.     

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తుండటంతో డికె.అరుణ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం బిజెపిలో చేరిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడూ బిజెపిని మతతత్వపార్టీ అంటూ విమర్శలు గుప్పించిన ఆమె బిజెపిలో చేరిన తరువాత ఇప్పుడు ప్రజలందరూ బిజెపివైపే చూస్తున్నారనడం విచిత్రంగా ఉంది. నేతలు పార్టీలు మారినంత మాత్రన్న ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాలు మార్చుకొంటారనుకోవడం ఇంకా హాస్యాస్పదంగా ఉంటుంది.