రాజీవ్ హంతకురాలు పెరోల్‌పై విడుదల

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా నిర్దారించబడి ప్రస్తుతం తమిళనాడులో వేలూరు జైలులో యావజ్జీవకారాగార శిక్ష అనుభవిస్తున్న నళినికి మద్రాస్ హైకోర్టు నెలరోజుల పాటు షరతులతో కూడిన పెరోల్ మంజూరు చేసింది. ఆమె తన కుమార్తె వివాహ ఏర్పాట్లు చేసుకునేందుకు 6 నెలలు పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టును అభ్యర్ధించగా నెల రోజులు మాత్రమే మంజూరు చేసింది. కేవలం పెళ్ళి పనులు చూసుకునేందుకే పెరోల్ మంజూరు చేస్తున్నామని కనుక జైలు నుంచి బయటకు వెళ్లినప్పుడు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, రాజకీయనాయకులను, ప్రముఖులను కలవరాదని, కలిసిన్నట్లు తెలిస్తే వెంటనే పెరోల్ రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. హైకోర్టు షరతులకు ఆమె అంగీకరించడంతో ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమె పూచీకత్తులు సమర్పించడంతో ఆమెను వేలూరు జైలు అధికారులు గురువారం ఉదయం జైలు నుంచి విడుదల చేశారు. 

రాజీవ హత్యకు కుట్ర పన్నినవారిలో నళిని భర్త మురుగన్‌తో సహా మొత్తం 7 మంది గత 27 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారు కూడా వేలూరు జైలులోని పురుష ఖైదీల వార్డులోనే ఉన్నారు.