3.jpg)
కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్యూరప్ప కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చివేయగలిగారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడే కాంగ్రెస్ అధిష్టానం మేల్కొని ఉండాలి. కానీ కొంపకు నిప్పంటుకొందని తెలిసున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నీరో చక్రవర్తిలా వ్యవహరించడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది.
ఈరోజుల్లో ఎంత శ్రమించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడం ఎంతో కష్టం. ఆవిషయం కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. అటువంటప్పుడు కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు గట్టిగా ప్రయత్నించలేదో అర్ధం కాదు. రాహుల్ గాంధీ అస్త్రసన్యాసం చేయడంతో పార్టీ అధిష్టానంలో అందరూ అదే జాతీయ సమస్యగా భావిస్తూ కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని విస్మరించారా? లేక కాంగ్రెస్ అధిష్టానానికి కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకోలేమని భావించినందున విస్మరించిందా? తెలియదు గానీ కర్ణాటక రాజకీయ సంక్షోభంపై పార్లమెంటులో 2-3 రోజుల హడావుడి చేసి చేతులు దులుపుకొంది.
ఈ వ్యవహారంలో బిజెపి అధిష్టానం మాత్రం చాలా తెలివిగా చేతికి మట్టి అంటకుండా వ్యవహరించిందనే చెప్పాలి. కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలోకి ఫిరాయింపజేస్తే న్యాయస్థానం చేత మొట్టి కాయలు పడవచ్చు లేదా స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయవచ్చు కనుక ఫలితం ఉండదు. అందుకే బిజెపికి (105 మంది ఎమ్మెల్యేలు) ఉన్న బలం కంటే కాస్త తక్కువగా 103 ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేవిధంగా శాసనసభలో ‘మ్యాజిక్ ఫిగర్’ను సెట్ చేయడానికి గొప్ప వ్యూహమే పన్నింది. అందుకోసం ముందుగా 15 మంది కాంగ్రెస్,జెడిఎస్ ఎమ్మెల్యేల చేత తిరుగుబాటు చేయించింది. చివరి నిమిషం వరకు వారు మనసు మార్చుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంది. చివరికి ప్లాన్ ప్రకారం శాసనసభలో రాజ్యాంగబద్దంగా కుమారస్వామి దిగిపోయేలా చేసి అధికారం చేజిక్కించుకొంటోంది.
బిజెపియే ఇదంతా చేయిస్తోందనే సంగతి కాంగ్రెస్-జెడిఎస్‌లతో సహా లోకమంతటికీ తెలుసు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలే బిజెపిని అడ్డుకునేందుకు నానా తిప్పలు పడ్డారు తప్ప కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా ప్రయత్నించలేదు! కనుక ఇందుకు బిజెపిని నిందించడం కంటే కాంగ్రెస్ తనను తానే నిందించుకోకతప్పదేమో? కాంగ్రెస్ అధిష్టానం నిర్లిప్తత లేదా వైఫల్యం కారణంగా కర్ణాటకలో చేజేతులా అధికారం జారవిడుచుకొంది. ఇక ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు కూడా.