కుమారస్వామి ప్రభుత్వం కూలింది

ఊహించినట్లుగానే కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఈరోజు కర్ణాటక శాసనసభలో జరిగిన బలపరీక్షలో కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 99 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలుకగా, వ్యతిరేకంగా బిజెపికి చెందిన 105 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడంతో బలపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం ఓడిపోయినట్లు స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. 

ఊహించినట్లుగానే కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలకు చెందిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈరోజు సభకు హాజరుకాకపోవడంతో బలపరీక్ష సమయంలో సభలో మొత్తం 205 మంది సభ్యులున్నారు. కనుక మ్యాజిక్ ఫిగర్ 103 అయ్యింది. బిజెపికి 105 మంది సభ్యులు ఉండటంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కుమారస్వామిని గద్దె దించారు. దీంతో ఏనాటికైనా కుమారస్వామిని గద్దె దించుతానన్న ఎడ్యూరప్ప పంతం నెరవేర్చుకొన్నట్లయింది. 

మరికొద్ది సేపటిలో కుమారస్వామి గవర్నర్‌ వజూభాయ్ వాలాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారు. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్న ఎడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ కోరడం, రేపో ఎల్లుండో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరగనున్నాయి. 

కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడం కోసం జరిగిన ఈ వికృత రాజకీయక్రీడను చూసి కర్ణాటక ప్రజలే కాదు...యావత్ దేశ ప్రజలు అసహ్యించుకొంటున్నారంటే అతిశయోక్తి కాదు.