
ఈనెల 24న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం. ఈ సందర్భంగా తెరాస నేతలు, అభిమానులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీడియాలో ప్రకటనలు ఇచ్చి డబ్బు వృధా చేయవద్దని, అలాగే తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారెవరూ పువ్వులు, బొకేలు తీసుకురావద్దని చెప్పారు. ఆ డబ్బుతో తమ చుట్టుపక్కల అవసరమున్నవారికి సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. సహాయం చేయడంతో పాటు మరో ముగ్గురిని నామినేట్ చేసి వారిని కూడా ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ చేసిన ఈ ప్రతిపాదనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు, నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సీనియర్ నేతల వరకు చివరికి...విదేశాలలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు సైతం ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
తాజాగా ఈ ‘గిఫ్ట్ ఎ స్మైల్ ఛాలెంజ్’ లో భాగంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తన నియోజకవర్గంలో ఒక స్వచ్ఛంద సంస్థకు అంబులెన్స్ కొనుగోలుకు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ శిరీశ్ రావు అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి 250 డాలర్లు విరాళంగా అందించగా, శశి కనపర్తి అనే ఎన్ఆర్ఐ నిశాంత్ క్యాన్సర్ ఫౌడేషన్‌కు 500 డాలర్లు విరాళంగా అందజేశారు.