రెండు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు

తెలంగాణలో రెండు సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు కేంద్ర పర్యావరణ సలహా మండలి సిఫార్సు చేసింది. పెన్ గంగనదిపై ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న చనాకా-కోర్టా బరాజ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తుపాకుల గూడెం వద్ద పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజిలకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయవచ్చని సూచించింది. 

జూన్ 27వ తేదీన డిల్లీలో దేశంలోని ఇతర ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని ఈ రెండు ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ సలహా మండలి సమీక్షా సమావేశం జరిపింది. ఆ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన ఉన్నతాధికారులు ఆ రెండు ప్రాజెక్టులపై సమగ్ర నివేదికలు సమర్పించి, సలహామండలి సభ్యులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేయడంతో ఆ రెంటికీ సలహా మండలి క్లియరెన్స్ ఇచ్చింది.  

రూ.399.16 కోట్ల వ్యయంతో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా చనాకా-కోర్టా బరాజ్ ను నిర్మిస్తున్నాయి. దీనివలన అదిలాబాద్ జిల్లాలోని ధాంసీ, జైనథ్ పరిధిలోని 23 గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. తెలంగాణలో 13,499 ఎకరాలకు, మహారాష్ట్రలో 2,999 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి తెలంగాణ1.2 టీఎంసీలు, మహారాష్ట్ర 0.3 టీఎంసీలు నీళ్ళు వినియోగించుకోగలవు. 

దేవాదుల ప్రాజెక్టుకు 3కిమీ దిగువన రూ.2,121 వ్యయంతో నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీ ద్వారా దేవాదుల పరిధిలో 6.21 లక్షల ఎకరాలు, శ్రీరామ్ సాగర్ రెండో దశలో భాగంగా 7,51, 200 ఎకరాల స్థిరీకరణకు అవసరమైన నీటిని అందించవచ్చు. ఈ ప్రాజెక్టుతో ఖమ్మం, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చాలా ప్రయోజనం కలుగుతుంది.

ఈ రెండు ప్రాజెక్టులకు క్లియరెన్స్ మంజూరు చేస్తూ, అక్కడ చేపట్టవలసిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు.