చింతమడకపై కేసీఆర్‌ వరాల జల్లు

సిఎం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకపై వరాల జల్లు కురిపించారు. గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “చింతమడక గ్రామానికి నాలుగు వైపులా నాలుగు చెరువులుండటంతో మంచి వాస్తు కుదిరింది. ఈ గ్రామంలో పుట్టిపెరిగిన వ్యక్తిగా ఈ గ్రామం, ప్రజల రుణం తీర్చుకోవాలనుకొంటున్నాను. గ్రామంలో ప్రతీ కుటుంబం సుఖసంతోషాలతో హాయిగా జీవించాలని కోరుకొంటున్నాను. అందుకోసం గ్రామంలో నివశిస్తున్న 2,000 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధికసహాయం అందించాలని నిర్ణయించాను. దానితో ఎవరికి నచ్చిన, వచ్చిన వృత్తి, వ్యాపారం లేదా వ్యవసాయం చేసుకోవచ్చు. దానితో నిర్ధిష్టంగా ఇదే కొనుక్కోవాలని కానీ లేదా ఇంతే ఖర్చు చేయాలని కానీ లేదా ఇదే వృత్తి ఎంచుకోవాలని గానీ ఎవరూ మీపై ఒత్తిడి చేయరు. ఆ డబ్బుతో పాడిపశువులు, ట్రాక్టర్లు, ఆటోరిక్షాలు, పికప్ వ్యానులు ఏవైనా కొనుక్కోవచ్చు లేదా వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఆ డబ్బు అంతా ఒక్క దానిపైనే ఖర్చు చేయాలని కూడా లేదు. ఉపాది, ఆదాయం కల్పిస్తుందనుకుంటే  రెండు మూడు రకాల వృత్తులు లేదా బర్రెలు, వాహనాలపై పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పధకాన్ని ప్రస్తుతం ఊళ్ళో ఉన్నవారికే కాకుండా, పొట్ట చేత్తో పట్టుకొని ఎప్పుడో వేరే ఊళ్ళకు, వేరే రాష్ట్రాలకు వెళ్ళినవారికి కూడా వర్తింపజేయాలనుకొంటున్నాము కనుక వాళ్ళను కూడా పిలిపించాలని గ్రామ పెద్దలను కోరుతున్నాను.” 

గ్రామాభివృద్ధి గురించి మాట్లాడుతూ, “నేను దత్తత తీసుకున్న గజ్వేల్‌ ఎంత సుందరంగా, ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దామో అదేవిధంగా చింతమడకను కూడా అభివృద్ధి చేయాలనుకొంటున్నాను. గ్రామంలో నివశిస్తున్న ఒంటరి మహిళలతో సహా గ్రామంలో ప్రతీ ఒక్కరికీ సొంత డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉండాలి. వాటి కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తాను. నా వంతు పని నేను చేస్తాను. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచన చేయాలి. వెంటనే పనులు మొదలుపెట్టి కార్తీకమాసంనాటికి కొత్త ఇళ్ళలో గృహాప్రవేశాలు చేసుకోవాలని కోరుకొంటున్నాను. గ్రామానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, కళ్యాణ మండపం వంటివన్నీ ఏర్పాటుచేయడానికి అవసరమైన నిధులు జిల్లా కలెక్టర్‌కు అందుబాటులోనే ఉంటాయి. కనుక గ్రామంలో పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని, గ్రామానికి ఏమేమి కావాలో మీరే నిర్ణయించుకొని మీ ఎమ్మెల్యే లేదా జిల్లా కలెక్టరుకు చెప్పండి. వెంటనే పనులు మొదలుపెట్టేస్తారు,” అని అన్నారు. 

చింతమడక గ్రామంలో ప్రతీ ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు, గ్రామస్తులు అందరికీ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పారు. అవసరమైతే హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు చేయిస్తామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చిన్నా పెద్ద అందరికీ పూర్తి వైద్య పరీక్షలు చేయించి వారి ఆరోగ్య డాటాబ్యాంక్ ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు సిఎం కేసీఆర్‌ తెలిపారు. అది చింతమడక గ్రామం నుంచే మొదలవుతుందని అన్నారు. చింతమడక గ్రామం అన్ని విదాలా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేవిధంగా అభివృద్ధి సాధించాలని కోరుకొంటున్నాని సిఎం కేసీఆర్‌ అన్నారు.