భారత్‌కు పాక్‌ ఎయిర్ క్లియరెన్స్

భారత్‌-పాక్‌ మద్య ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా ఇరుదేశాలు పరస్పరం ఏవో ఆంక్షలు విధించుకోవడం, పరిస్థితులు చల్లబడిన తరువాత వాటి వలన తామే నష్టపోతున్నామని గ్రహించి ఆంక్షలను సడలించుకోవడం దశాబ్ధాలుగా జరుగుతున్నదే. పుల్వామా ఉగ్రదాడి కారణంగా మళ్ళీ ఇరుదేశాల మద్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ఇరుదేశాలు గగనతల వినియోగంపై ఆంక్షలు విధించుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు చల్లబడ్డాయి కనుక పాక్‌ గగనతలం మీదుగా భారత్‌ విమానాలు ప్రయాణించేందుకు ఆంక్షలు సడలించాలని భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పాక్‌ ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి నుంచి తమ గగనతలంపై ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గత 5 నెలలుగా భారత్‌ నుంచి యూరోప్ దేశాలకు చుట్టు తిరిగి వెళుతున్న ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ విమానాలు మంగళవారం నుంచి పాకిస్థాన్‌ గగనతలం మీదుగా ప్రయాణిస్తాయి. పాక్‌ గగనతలం మూసివేయడం వలన గత 5 నెలలో ఎయిర్ ఇండియా సంస్థ అత్యధికంగా రూ. 491 కోట్లు నష్టపోగా, స్పైస్ జెట్ రూ.30.73 కోట్లు, ఇండిగో రూ.25.1 కోట్లు, గో ఎయిర్ రూ.2.1 కోట్లు నష్టపోయాయి.