తెలంగాణకు తాత్కాలిక సచివాలయం!

పాలనాసౌలభ్యం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించుకోవలసి వచ్చింది. కానీ సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త సచివాలయం నిర్మించుకోవాలని తెరాస సర్కారు నిర్ణయించడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.  

కొత్త సచివాలయం సిద్దమయ్యేవరకు రాష్ట్రానికి తాత్కాలిక సచివాలయం అవసరం కనుక ట్యాంక్ బండ్ రోడ్డు ఎదురుగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను తాత్కాలిక సచివాలయంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సువిశాలంగా నిర్మించబడిన ఆ భవనం నగరం నడిబొడ్డున ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధుల రాకపోకలకు అనువుగా ఉంటుంది. పాలనాపరంగా, భద్రతాపరంగా కూడా అనువుగా ఉండటం వంటి కారణాల చేత బీఆర్‌కే భవన్‌ను తాత్కాలిక సచివాలయంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కనుక ప్రస్తుత సచివాలయంలోని సీఎంఓ, సాధారణ పరిపాలనాశాఖ, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కార్యాలయంతో సహా అనేక ముఖ్య కార్యాలయాలను బీఆర్‌కే భవన్‌లోకి తరలించబోతున్నారు. కానీ బీఆర్‌కే భవన్‌ అన్ని కార్యాలయాలకు  సరిపోదు కనుక కొన్నిటిని ఆదర్శ్ నగర్‌లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లోను, మరి కొన్నిటిని ఎర్రమంజిల్లోని ప్రభుత్వ కార్యాలాయానికి, నాంపల్లిలోని జలసౌధ, చంద్రవిహార్, అరణ్యభవన్‌కు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.

సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఈ నెలాఖరులోగా వేరే చోటికి తరలిపోనున్నాయి. ఆ తరువాత, హైకోర్టు అనుమతితో సచివాలయం కూల్చివేతపనులు ప్రారంభం కావచ్చు. 

కానీ సచివాలయంలోని ప్రభుత్వ కార్యాలయాల తరలింపులో ఒక సాంకేతిక సమస్య ఎదురవుతోంది. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయంలోనే ఉన్నందున వాటి మద్య సమాచారం, ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు వంటివన్నీ “ఇంట్రానెట్ వ్యవస్థ” ద్వారా జరుగుతుండేవి. సచివాలయానికి బీఆర్‌కే భవన్‌ సమీపంలోనే ఉన్నందున దానిలో ఏర్పాటు చేసే కార్యాలయాలకు ‘ఇంట్రానెట్’తో అనుసంధానం కావడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండబోదు కానీ నాంపల్లి, ఎర్రమంజిల్, ఆదర్శనగర్ వంటి ప్రాంతాలలో ఏర్పాటు చేయబోయే కార్యాలయాలను ఇంట్రానెట్ ద్వారా తాత్కాలిక సచివాలయంతో అనుసంధానం చేయడమే కష్టం. ఆలాగని ప్రజలందరూ ఉపయోగించే 'ఇంటర్నెట్' ద్వారా ఇటువంటి రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొంటే ప్రమాదం కనుక అధికారులు ఈ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.