అధికారం కోసం ఇంత దిగజారిపోవాలా?

ఒకప్పుడు ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి వచ్చామని నేతలు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అధికారమే తమ లక్ష్యమని అన్ని పార్టీలు బాహటంగానే చెప్పుకొంటున్నాయి. దాని కోసం అన్ని పార్టీలు ఒక్కో మెట్టూ దిగుతూ తాము సృష్టించుకున్న ఊబిలోనే కూరుకుపోతున్నాయి. 

కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడం కోసం ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు యెడ్యూరప్ప ఎంతగా తాపత్రయపడుతుంటారో అందరికీ తెలుసు. అయితే అధికార కాంగ్రెస్‌-జెడిఎస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలను బిజెపిలోకి ఫిరాయింపజేస్తే ఊహించని సమస్యలు ఎదురవుతాయని భావించిన ఆయన ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అధికార కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగరును 113 నుంచి 106కు దింపాలనుకున్నారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యేను బిజెపివైపు తిప్పుకున్నారు. దాంతో బిజెపికున్న 105 మంది ఎమ్మెల్యేలతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చివేసి ఈవిధంగా అధికారం చేజిక్కించుకోవాలనుకోవడం రాజకీయాలలో దిగజారుడుతనానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. 

అయితే అధికారం కోసమే11 కాంగ్రెస్‌, ఇద్దరు జెడిఎస్ ఎమ్మెల్యేల బిజెపివైపు వెళ్ళిపోయారు కనుక వారికి అధికారమే ఎరగా వేసి వెనక్కు రప్పించుకోవడానికి కుమారస్వామి ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌-జెడిఎస్ పార్టీలకు చెందిన మంత్రులు అందరూ ఈరోజు రాజీనామాలు చేశారు. బిజెపివైపు వెళ్ళిన 13 మందికి మంత్రిపదవులు ఇచ్చి తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే త్యాగాలు చేశామని వారు చెపుతున్నారు. 

ప్రస్తుతం కాంగ్రెస్‌-జెడిఎస్, బిజెపి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. కుమారస్వామి ప్రభుత్వం నిలుస్తుందా లేక గవర్నర్ సాయంతో బిజెపి మళ్ళీ అధికార చేజిక్కించుకొంటుందా? ఒకవేళ కాంగ్రెస్‌-జెడిఎస్ కూటమి నిలిస్తే, కుమారస్వామి కొనసాగుతారా లేక ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి వస్తారా? వస్తే కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలలో ఏ పార్టీకి చెందినవ్యక్తి సిఎం అవుతారు? అనే ప్రశ్నలన్నిటికీ ఒకటి రెండు రోజుల సమాధానాలు లభించవచ్చు. కానీ అధికారం కోసం జరుగుతున్న ఈ కుటిలరాజకీయాలను చూసి ప్రజలు చీదరించుకొంటున్నారు.