కాళేశ్వరం నుంచి గలగలా పారుతున్న గోదారి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణదశలో ఉన్నప్పుడు ఎటు చూసినా ఎండిన భూములు...వాటిలో తిరిగే భారీ వాహనాలే కనిపిస్తుండేవి. కానీ ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో, కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజికి సుమారు 30,000 క్యూసెక్కుల నీరు చేరడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఎటు చూసినా గలగల పారుతున్న గోదారే కనిపిస్తూ అందరినీ పులకింపజేస్తోంది. 




మేడిగడ్డ తరువాత స్థానంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఆదివారం రెండు మోటర్లను ఆన్‌ చేసి నీటిని ఎత్తిపోస్తుంటే అది కాలువ నిండా పారుతూ అన్నారం బ్యారేజీకి చేరుకొంటోంది. ఆదివారం ఒక్కరోజే సుమారు 26,000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీలో 0.8 టీఎంసీల నీరు చేరింది. 


ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వద్ద ఏర్పాటు చేసిన దేవాదుల ఇన్-టేక్ వెల్‌లో 76.5 మీటర్లకు నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు అక్కడి మోటర్లు కూడా ఆన్‌ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి వద్ద అత్యల్పంగా 179 క్యూసెకులు, పేరూరు వద్ద అత్యధికంగా 36,887 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో దిగువన ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ వారం రోజులలో మొత్తం 4 టీఎంసీలు నీళ్ళను సముద్రంలోకి విడిచిపెట్టారు.