యూపీలో ఘోరప్రమాదం 29 మంది మృతి

యూపీలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో నుంచి డిల్లీ వస్తున్న యూపీఎస్ ఆర్టీసీ బస్సు  డిల్లీ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై అదుపుతప్పి రోడ్డు పక్కనే 50 అడుగుల లోతున్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది అక్కడికక్కడే చనిపోగా బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లలో ఆసుపత్రులకు తరలించారు. డ్రైవరు నిద్రమత్తులో అతివేగంతో బస్సు నడపడం వలననే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం. 

165కిమీ పొడవుగల యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే డిల్లీ-నోయిడా-ఆగ్రా-లక్నో నగరాలను కలుపుతుంది. చాలా సువిశాలంగా ఉండే యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్డుపై పెద్దగా సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్స్ వంటివి లేకుండా వాహనాలు చాలా వేగంగా, సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలుగా నిర్మించబడింది. కానీ అవే కారణాల చేత ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతుండటం చాలా విచిత్రం. 


ఆ రోడ్డుపై గరిష్టంగా గంటకు 100 కిమీ వేగంతో మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉన్నప్పటికీ, రోడ్డుపై ఎటువంటి అవరోదాలు లేకపోవడంతో గంటకు 130-150 కిమీకి మించిన వేగంతోనే వాహనాలు దూసుకుపోతుంటాయి. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబడినప్పటి నుంచి నేటి వరకు వందలాది వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. అనేకమంది వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సు డ్రైవరు నిద్రలోకి జారుకున్నట్లు సమాచారం.