పిసిసి అధ్యక్ష పదవి కావాలి: వెంకట్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో ఫిరాయించినప్పుడు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని అన్నారు. ఆ పరిస్థితులలో పార్టీని కాపాడటం కష్టమని బహుశః అప్పుడు భావించారేమో? కానీ ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలలో భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచిన తరువాత మళ్ళీ ఇప్పుడు ఆయనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. కనుక ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవిపై ఆశ పడుతున్నారు. 

ఆదివారం భువనగిరిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసి, అధికారంలోకి తీసుకువస్తాను. కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకుపోతుందని తెరాస, బిజెపిలు పగటికలలు కంటున్నాయి కానీ బలమైన క్యాడర్, ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయడం ఎవరివల్లా కాదని గ్రహించాలి. నా సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడం ఆయన వ్యక్తిగత విషయం. దానితో నాకు సంబందం లేదన్నారు. నేను మాత్రం నా కంఠంలో ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను,” అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

అవకాశం లభిస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని పార్టీలో ఉవ్విళ్ళూరిన సీనియర్లు సైతం ఫిరాయింపులతో బలహీనపడి విలవిలలాడుతున్న కాంగ్రెస్‌ పార్టీని ఆదుకునే ప్రయత్నం చేయకుండా నిద్రావస్థలోకి వెళ్లిపోగా, ఈ పరిస్థితులలో కూడా పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధైర్యంగా ముందుకు వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తయినందున ఎలాగూ తప్పుకోవాలనుకొంటున్నారు కనుక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మంచిదేమో?