తెలంగాణలో అధికారమే మా లక్ష్యం: అమిత్ షా

తెలంగాణలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడానికి శనివారం హైదరాబాద్‌ వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శంషాబాద్‌ వద్ద బహిరంగసభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు వచ్చాను. ఇక్కడ కూడా బిజెపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలి. మిగిలిన పార్టీలలోగా మన పార్టీలో కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు లేవు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతీఒక్కరికీ ఉన్నతస్థాయికి ఎదగడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఇదే మన పార్టీ ప్రత్యేకత. ఆంధ్రా, తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో మన పార్టీ తప్పకుండా బలపడుతుంది,” అని అన్నారు.           

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో కుటుంబపాలన, నియంతృత్వ పాలన సాగుతోంది. దానిని అంతమొందించడమే బిజెపి లక్ష్యం. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్‌కు అయ్యింది. నీటి బుడగ తెరాస కూడా భవిష్యత్‌లో అదృశ్యమవుతుంది. కర్ణాటక తరువాత తెలంగాణలో మన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొని తెరాసను డ్డీకొని నయా నిజాం పాలనకు ముగింపు పలుకుదాము,” అని అన్నారు.