నిజామాబాద్‌లో విషాదఘటన

నిజామాబాద్‌ నగర శివారులో నాగారంలో ముగ్గురు విద్యార్దులు నీటి కుంటలో పడి మృతి చెందారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొంటున్న వారు ముగ్గురూ శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం పాఠశాల నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాకపోవడంతో స్కూలు ప్రిన్సిపాల్, ఉపాద్యాయులు, విద్యార్దులు వారికోసం చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికారు. కానీ వారి జాడ కనుగొనలేకపోవడంతో వారి తల్లితండ్రులకు సమాచారం అందించి, 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కూడా అక్కడకు చేరుకొని తప్పిపోయిన ఆ విద్యార్దుల కోసం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతుకుతుండగా అక్కడే ఉన్న నీటి గుంటలో నుంచి ఒక విద్యార్ధి శవం బయటకు తేలింది. వెంటనే మోటారుపంపులను తెచ్చి గుంటలో నీటిని తోడిపోసి, మిగిలిన ఇద్దరు విద్యార్దుల శవాలను కూడా వెలికి తీశారు. వారు నమాజుకు ముందు కుంటలో నీటితో చేతులు, కాళ్ళు కడుక్కోవాలని ప్రయత్నించినప్పుడు ప్రమాదవశాత్తూ దానిలో పడి చనిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.