
కేంద్రప్రభుత్వం ఎప్పటిలాగే బడ్జెట్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ‘హ్యాండ్’ ఇచ్చిందని తెరాస లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. “రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులలో ఒక్కదానికైనా బడ్జెట్లో రాయితీ లభిస్తుందని ఆశించాము కానీ అసలు బడ్జెట్లో వాటి ప్రస్తావనే లేకపోవడం చాలా బాధాకరం. తెలంగాణ కోసం ఒకటి రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తారని ఆశిస్తే అదీ లేదు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి అర్బన్ ఇండియా పధకంలో భాగంగా అబివృద్ధి పనులు లేదా నిధులు కేటాయించి ఉండి ఉంటే బాగుండేది. కానీ పట్టించుకోలేదు. ఏటా రాష్ట్రానికి వేలకోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. రాష్ట్రం పట్ల వివక్ష బడ్జెట్లో స్పష్టంగా కనబడుతోంది,” అని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “ఉత్తరప్రదేశ్ ఒక రూపాయి పన్ను చెల్లిస్తే కేంద్రప్రభుత్వం తిరిగి రెండు రూపాయలు ఇస్తోంది. అదే దక్షిణాది రాష్ట్రాలు రూపాయి చెల్లిస్తే కేంద్రం 65 పైసలే తిరిగి ఇస్తోంది. నిర్మలా సీతారామన్ దక్షిణాదికి చెందినవారైనప్పటికీ, ప్రధాని నరేంద్రమోడీకి భయపడి దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష చూపారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా విభజన హామీల అమలుకు ప్రయత్నించకపోవడం చాలా బాధాకరం,” అని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, “ఈ బడ్జెట్లో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. సిఎం కేసీఆర్ ఐదేళ్ళపాటు మోడీ భజన చేసినా కనికరించలేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వేటినీ కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు,” అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్, తెరాస నేతలు బడ్జెట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.