220 మంది అధికారులు...180 మంది పోలీసులు!

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ శివారులో మొన్న ఆదివారంనాడు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి వచ్చిన మహిళా అటవీశాఖ అధికారిణి అనిత, సిబ్బందిపై స్థానిక తెరాస నేత కోనేరు కృష్ణారావు, అనుచరులు కలిసి దాడి చేయడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ ఆ ప్రాంతంలోనే మొక్కలు నాటాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. కానీ అక్కడకు ఒంటరిగా వెళితే గ్రామస్తులు మళ్ళీ దాడి చేయవచ్చుననే భయంతో ఈసారి భారీ పోలీస్ బందోబస్తుతో సోమవారం అక్కడకు చేరుకొని వందలాది మొక్కలను నాటారు. 

హరితహారం కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 220 మంది పాల్గొనగా, వారికి భద్రతగా జిల్లా ఎస్పీ మల్లారెడ్డితో సహా ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, బెల్లంపల్లి ఏసీపీ బాలు జాదవ్, జిలాలోని సీఐలు, ఎస్సైలు, రామగుండం కమీషనర్ సత్యనారాయణ ఇంకా అనేకమంది అధికారులు, పోలీసులతో కలిపి మొత్తం 180 మంది తరలివచ్చి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “అటవీ శాఖకు చెందిన ఈ భూమిపై ఎవరికీ హక్కులేదు. మొక్కల సంరక్షణకు వచ్చే అటవీశాఖ అధికారులపై, సిబ్బందిపై గ్రామంలో ఎవరైనా మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నించినా లేదా ఈరోజు మేము వేసిన మొక్కలను పీకేసినా వారిపై కటిన చర్యలు తప్పవు. ఒకవేళ రైతులకు అన్యాయం జరిగిందని భావిస్తే ప్రజాస్వామ్యపద్దతిలో నిరసన తెలుపవచ్చు లేదా అధికారులకు తమ సమస్యలను నివేదించుకొని పరిష్కరింపజేసుకోవచ్చు. కానీ అధికారులు, సిబ్బందిపై దాడులకు ప్రయత్నిస్తే ఎవరినీ ఉపేక్షించబోము,” అని హెచ్చరించారు.