తెరాస-కాంగ్రెస్‌ ఘాటుగా మాటకు మాట

సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణం వ్యవహారంలో అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలకు మద్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతలు చేసిన విమర్శలపై తెరాస ఎమ్మెల్యే బాల్కసుమన్‌ స్పందిస్తూ, “కొత్త సచివాలయం, శాసనసభ భవనాలను సిఎం కేసీఆర్‌ తన కోసం కట్టుకోవడం లేదు ప్రభుత్వం కోసమే కదా కడుతున్నారు? మరి కాంగ్రెస్‌ నేతలు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు?” అని ఘాటుగా బదులిచ్చారు. 

వాటిపై మళ్ళీ  సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పందిస్తూ, “కొత్త భవనాల నిర్మాణాల కోసం సిఎం కేసీఆర్‌ తన జేబులో నుంచి డబ్బు తీసి ఖర్చు చేయరుగా? వాటి నిర్మాణం కోసం ఆయన చేసే అప్పుల భారం రాష్ట్ర ప్రజలపైనే పడుతుంది గాబట్టి మేము కేసీఆర్‌ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాము. కేసీఆర్‌ తప్పుడు నిర్ణయాలకు ప్రజలు శిక్ష అనుభవించాలా? అయినా ప్రభుత్వం మారినప్పుడల్లా పాత భవనాలను కూల్చివేసి కొత్తవి కట్టాలనుకోవడం ఏమిటి? రేపు మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు కేసీఆర్‌ కట్టించబోతున్న భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి కడతామంటే ఎవరైనా హర్షిస్తారా? ఇకనైనా సిఎం కేసీఆర్‌ దీనిపై పునరాలోచించుకుంటే మంచిది. అవసరమైతే ఒక కమిటీని వేసి కొత్త భవనాల నిర్మించడం అవసరమా కాదా తెలుసుకుంటే మంచిది,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ నేతలు అంగీకరించినా అంగీకరించకపోయినా కొత్త సచివాలయం, శాసనసభ భవనాలు నిర్మిస్తామని తెరాస స్పష్టంగా చెపుతున్నప్పుడు ఈ వాగ్వాదాల వలన ఎటువంటి ప్రయోజనం ఉండబోదని అందరికీ తెలుసు. కనుక దీనిపై కాంగ్రెస్‌ నేతలు వేసిన పిటిషన్లపై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందనేదే ముఖ్యం.