బిజెపికి అది అలవాటే: మర్రి శశిధర్‌రెడ్డి

సీనియర్ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి త్వరలో బిజెపి చేరబోతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు పి.శశిధర్ రెడ్డి బిజెపిలో చేరగా, బిజెపి ఎం.శశిధర్ రెడ్డి బిజెపిలో చేరినట్లు జాతీయమీడియాకు సమాచారమిచ్చింది. పార్టీలో చేరిన వ్యక్తి ఎవరో తెలుసుకోకుండా పొరపాటున మీడియాకు అటువంటి సమాచారం ఇచ్చారనుకోలేము. బిజెపికి ఇటువంటి చవకబారు మైండ్ గేమ్స్ ఆడటం అలవాటే కనుక నా ప్రతిష్టను, రాజకీయ విశ్వసనీయతను దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే ఆవిధంగా చేసి ఉండవచ్చు. అయితే మీడియా మిత్రులు కూడా ఈవిషయం గురించి నన్ను సంప్రదించి నిర్ధారించుకోకుండా నేను బిజెపిలో చేరబోతున్నానంటూ వార్తలు ప్రసారం చేసేసారు. ఇది చాలా దురదృష్టకరం. గాంధేయ సిద్దాంతాలకు, లౌకికవాదానికి కట్టుబడి ఉండే వ్యక్తిని నేను కనుక గాంధీజీని చంపిన గాడ్సే వారసులతో చేతులు కలుపుతాననుకోవడం అవివేకమే. నేను పార్టీ మారుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్దమే. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకపై నాపై ఈవిధంగా ఎవరూ దుష్ప్రచారం చేయవద్దని కోరుతున్నాను. నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. పార్టీ మారే ప్రసక్తే లేదు,” అని అన్నారు.