కాంగ్రెస్‌లో మరో రెండు వికెట్లు?

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నట్లు ప్రకటించిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన నిర్లిప్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో వలసలను ఎవరూ ఆపలేరని, ఒకరొకరుగా సీనియర్ నేతలు పార్టీని వీడివెళ్ళిపోతుంటే ఇక పార్టీని ఎవరూ కాపాడలేరనే భావన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం అసలేమీ జరగనట్లే వ్యవహరిస్తోంది. పార్టీ మనుగడ, గౌరవం కోసం ఆవిధంగా వ్యవహరించడం అవసరమే కానీ కళ్ల ముందే పార్టీ కుప్పకూలిపోతున్నా ఏమీ చేయలేకపోవడం నిజంగా బాధాకరమే. ఒకప్పుడు రాష్ట్రంలో టిడిపికి ఎదురైన చేదు అనుభవమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎదురవడం చాలా ఆశ్చర్యకరమే. 

ఇంతకీ విషయం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీలో మరో రెండు వికెట్లు పడబోతున్నాయని తాజా సమాచారం. వారిలో ఒకరు మర్రి శశిధర్ రెడ్డికాగా మరొకరు దామోదర రాజనర్సింహ భార్య పద్మిని అని తెలుస్తోంది. ఈనెల 6న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు వారిరువురూ బిజెపిలో చేరబోతున్నట్లు సమాచారం. తెరాస నుంచి కూడా కొంతమంది బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ పార్టీ నేత రాంమాధవ్‌ హైదరాబాద్‌లో మకాం వేసి ఇతర పార్టీల నేతలను బిజెపిలోకి రప్పించేందుకు తెర వెనుక మంతనాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక కాంగ్రెస్‌, తెరాసలో నుంచి ఎంతమంది బిజెపిలో చేరుతారనే సంగతి జూలై 6 తరువాత తేలిపోవచ్చు.