
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి గర్భగుడి ప్రదానద్వారానికి ఆదివారం ఉదయం పూజాకార్యక్రమాలు నిర్వహించి బిగించారు. సుమారు 12 అడుగులు ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న ద్వారాబందాన్ని భారీ కృష్ణ శిలలతో నిర్మించారు. దానికి టేకుతో అందంగా తయారుచేసిన తలుపులను బిగించారు. ఆ తలుపులపై బంగారంపూత పూసిన నృసింహస్వామివారి మూర్తిని, పద్మాలను, హంసలను అమర్చుతామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆలయ నిర్మాణపనులు శరవేగంగా సాగుతున్నాయని, ఈ ఏడాది చివరినాటికి దాదాపు అన్ని పనులు పూర్తికావచ్చునని తెలిపారు. యాదాద్రి కొండపైనే కాక కొండ దిగువన కూడా సుందరీకరణ పనులు చేపట్టమని తెలిపారు. యాదాద్రి ఆలయాభివృద్ధితో భక్తుల తాకిడి కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.