
ఈనెల 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా బిజెపి సభ్యత్వనమోదు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 6వ తేదీన హైదరాబాద్ రాబోతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ వారణాసిలో ప్రారంభిస్తారు. దానిలో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితర బిజెపి నేతలు పాల్గొంటారు. అనంతరం అమిత్ షా హైదరాబాద్ చేరుకొని శంషాబాద్ వద్ద గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తారు.
తెలంగాణలో బిజెపి సభ్యత్వనమోదు ప్రక్రియ పై చర్చించేందుకు జెపి నడ్డా నిన్న డిల్లీలో రాష్ట్ర నేతలు కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ కృష్ణదాస్, రాజాసింగ్, ఇంద్రసేనారెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్రంలో బిజెపి పుంజుకోవడంతో సిఎం కేసీఆర్ తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు. ఆ కారణంగానే రాష్ట్రంలో బిజెపి కార్యకర్తలపై తెరాస భౌతికదాడులకు పాల్పడుతోంది. తెరాస చేస్తున్న హత్యారాజకీయాలను ఎదుర్కొని తెరాసకు చెక్ పెడతాము. తెలంగాణపై బిజెపి అధిష్టానం ప్రత్యేకదృష్టి పెట్టింది. ఇక నుంచి ప్రతీనెల ఇద్దరు కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. ఈసారి రాష్ట్రంలో కొత్తగా 12 లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్చుకోవాలనే లక్ష్యంగా నిర్దేశించుకున్నము. ప్రస్తుతం సభ్యత్వ నమోదు, మున్సిపల్, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో సత్తా చాటడం మా ప్రధాన లక్ష్యాలు,” అని అన్నారు.