రాహుల్‌కు లేని పదవి నాకూ వద్దు: విహెచ్

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీ గట్టిగా హెచ్చరించేవరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ కూడా తమ పదవులకు రాజీనామాలు చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా రాజీనామాలు చేయవలసి రావడంతో కాంగ్రెస్ పార్టీ కోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్దమేనని డైలాగులు చెపుతుండటం విశేషం. ఆ జాబితాలో సీనియర్ కాంగ్రెస్‌ నేత ఏఐసిసి కార్యదర్శి వి.హనుమంతరావు కూడా ఉన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందినప్పటికీ నేటి వరకు తన పదవిలోనే కొనసాగుతున్న వి.హనుమంతరావు, ఈరోజు తన ఏఐసిసి కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రాహుల్ గాంధీకి ఏ పదవులూ అక్కరలేనప్పుడు నాకు కూడా అక్కరలేదు. అయినా రాహుల్ గాంధీ స్థానంలో కాంగ్రెస్ నేతలు మరొకరిని ఊహించుకోలేరు. మా అందరినీ ముందుండి నడిపించాల్సిన ఆయనే బాధ్యతల నుంచితప్పుకొంటే ఇక పార్టీని నడిపించేదెవరు? ఏవిధంగా నడుస్తుంది? రాహుల్ గాంధీ నిర్ణయం పట్ల నా వంటి కాంగ్రెస్‌ నేతలు అందరూ చాలా ఆందోళన చెందుతున్నాము. రాహుల్ గాంధీ మనసు మార్చుకొని పార్టీని ముందుకు నడిపించాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.