కోమటిరెడ్డికి అది అలవాటు కనుకనే...

సిఎం కేసీఆర్‌ కొత్త సచివాలయం, కొత్త శాసనసభ, మండలి భవనాలను నిర్మించడానికి సిద్దం అవుతుండటంతో కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ, “మనకు మంచి సచివాలయం, గొప్ప చరిత్ర ఉన్న శాసనసభ, మండలి భవనాలు ఉండగా కొత్తవి కట్టవలసిన అవసరమే లేదు. కానీ కేవలం కమీషన్ల కోసమే సిఎం కేసీఆర్‌ ఉన్న భవనాలను కూల్చుకొని కొత్తవి కట్టడానికి సిద్దం అవుతున్నారు. సిఎం కేసీఆర్‌ ఐదేళ్ళలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు,” అని అన్నారు. 

ఆయన విమర్శలపై తెరాస నేత బూర నర్శయ్య గౌడ్ ఘాటుగా స్పందిస్తూ, “గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కమీషన్ల కోసమే ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగి కాంట్రాక్టులు సంపాదించుకునేవారు. కనుక పచ్చ కామెర్లవాడికి లోక అంతా పచ్చగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఇవాళ్ళ మా నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శిస్తున్న  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేపు కొత్త సచివాలయం, శాసనసభ భవనాలు తయారైనప్పుడు వాటి ముంధు నిలబడి ఫోటోలు దిగుతారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం, మౌలికవసతుల కల్పన కోసం అప్పు చేయడం నేరం కాదు,” అని ఎద్దేవా చేశారు.