రేవంత్‌ రెడ్డి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఈరోజు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ నేతలు రాజీనామాలు చేయాలనే రాహుల్ గాంధీ సూచన మేరకు తాను రాజీనామా చేస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ కొంత బలహీనపడినప్పటికీ త్వరలోనే మళ్ళీ పుంజుకొని తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని రేవంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాహుల్ గాంధీ పిలుపు మేరకు శుక్రవారం పొన్నం ప్రభాకర్‌ కూడా తన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు మునుపు వారిరువురిని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లుగా నియమితులయ్యారు. లోక్‌సభ ఎన్నికలు కాగానే రాజీనామాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వారిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల తరువాత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తప్పుకోబోతునట్లు సమాచారం. కనుక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి. ఎవరికి అవకాశం లభించినప్పటికీ తెలంగాణలో తెరాస, బిజెపిలను తట్టుకొని పార్టీని బలోపేతం చేసుకోవడం కత్తి మీద సామూవంటిదేనని చెప్పవచ్చు.