
మాజీ ఏపీ సిఎం చంద్రబాబునాయుడుకు సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి శుక్రవారం నోటీస్ అందజేశారు. నరేందర్ రెడ్డి నేతృత్వంలో సీఆర్డీఏ అధికారులు శుక్రవారం ఉదయం ఉండవల్లిలో చంద్రబాబునాయుడు ఇంటికి చేరుకొని నోటీసులు అందజేశారు. చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న ఆ ఇంటిని నిబందనలకు విరుద్దంగా కట్టారని, దానికి తగిన అనుమతులు లేవని కనుక దీనిపై వారం రోజులలో సంజాయిషీ ఇవ్వాలని లేకుంటే ఇంటిని కూల్చివేస్తామని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.
ఇది ఊహించిన పరిణామమే అయినా జగన్ ప్రభుత్వం ఇంత త్వరగా చంద్రబాబునాయుడుపై చర్యలకు సిద్దపడుతుందని టిడిపి నేతలు కూడా ఊహించలేదు. దాంతో చంద్రబాబునాయుడు అత్యవసరంగా తన నివాసంలో టిడిపి నేతలతో సమావేశమయ్యి దీనిపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటువంటి పరిణామాలను ముందే ఊహించిన టిడిపి నేతలు చంద్రబాబునాయుడు కోసం విజయవాడ, గుంటూరు నగరాలలో తగిన ఇల్లు కోసం వెతుకులాట మొదలుపెట్టారని సమాచారం.
చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇల్లు పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్‌కు చెందినది. ఇంతకాలం తన కనుసన్నలలో పనిచేసిన సీఆర్డీఏ అధికారులు ఇప్పుడు తనకే నోటీసులు జారీ చేయడంపై చంద్రబాబునాయుడు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.