లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎంపిక

బిజెపి ఎంపీ ఓం బిర్లా లోక్‌సభ స్పీకరుగా నామినేషన్ వేయనున్నారు. లోక్‌సభలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉంది కనుక ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే. ఆయన  రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి సుమారు 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఈసారి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయకపోవడంతో ఆమెను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. 

బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జెపి నడ్డా:


బిజెపి చరిత్రలో మొట్టమొదటిసారిగా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవిని ఏర్పాటు చేసి, మాజీ కేంద్రమంత్రి జెపి నడ్డాకు ఆ బాధ్యతలు అప్పగించింది. బిజెపి జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న అమిత్ షా ఇప్పుడు కేంద్రహోంమంత్రి పదవి చేపట్టడంతో మాజీ కేంద్రమంత్రి జెపి నడ్డాకు పార్టీ పగ్గాలు అప్పగించాలని బిజెపి అధిష్టానం భావించింది.కానీ ఈ ఏడాది చివరిలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, అవి ముగిసేవరకు అమిత్ షాయే అధ్యక్షుడుగా కొనసాగాలని బిజెపి నిర్ణయించింది. అయితే ఆయన కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించవలసి ఉన్నందున, పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకు జెపి నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. వచ్చే ఏడాది మొదట్లో బిజెపి సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు అమిత్ షా పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ఆ తరువాత జెపి నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.