
కేంద్ర ఆర్ధిక శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, మహిళలపై లైంగిక వేదింపులకు పాల్పడినవారు, విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై మోడీ సర్కార్ కటినచర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఏకంగా 12 మంది సీనియర్ అధికారుల చేత బలవంతంగా పదవీ విరమణ చేయించి ఇంటికి పంపించింది. వారిపై జనరల్ ఫైనాన్షియల్ యాక్ట్ 56వ నిబందన కింద చర్యలు తీసుకొన్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. పదవులు కోల్పోయినవారి వివరాలు:
అశోక్ అగర్వాల్ జాయింట్ కమీషనర్ ఆదాయపు పన్ను (సిట్), ఎస్కే శ్రీవాత్సవ కమీషనర్ (అప్పీల్) నోయిడా, హోమీ రాజ్‌వంశ్, బీబీ రాజేంద్ర ప్రసాద్, అజయ్ కుమార్ సింగ్ (సిట్), బి అరుళప్ప (సిట్), ఆందాసు రవీందర్, అలోక్ కుమార్ మిత్రా, చందర్ సైని భారతి, శ్వేతాబ్ సుమన్, రామ్ మాధవ్‌ను కుమార్ భార్గవ, వివేక్ బాత్రా.
వారిలో నోయిడా కమీషనర్ ఎస్కే శ్రీవాత్సవ తన శాఖలోని మహిళా ఉద్యోగులపై లైంగిక వేదింపులకు పాల్పడుతుండేవారు. హోమీ రాజ్‌వంశ్ అక్రమార్జనతో కోట్లు పోగేసినట్లు రుజువయింది. అశోక్ కుమార్ అగర్వాల్ అధికార దుర్వినియోగానికి, అక్రమార్జనలకు పాల్పడినట్లు తేలింది. మిగిలినవారందరూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. ఒకేసారి ఇంతమంది సీనియర్ అధికారులను బలవంతంగా పదవీ విరమణ చేయించి ఇంటికి పంపించడం ద్వారా అవినీతి అధికారులందరికీ మోడీ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపించిందని చెప్పవచ్చు.