ఆపద్బందు పధకం గడువు పొడిగింపు

రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలను కష్టకాలంలో ఆదుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపద్బందు పధకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ 1వ తేదీతో దాని గడువు ముగిసిపోయింది. దానిని మళ్ళీ ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రింద పేర్కొన్న ప్రమాదాలు లేదా సంఘటనలలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50,000 ఆర్ధికసాయం అందిస్తుంది. ఈ పధకం కేవలం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. 

1. రోడ్డు ప్రమాదాలలో మరణించినప్పుడు  

2. నీటిలో మునిగినప్పుడు లేదా పడవ ప్రమాదాలలో మరణించినప్పుడు.  

3. వంతెనలు, భవన ప్రమాదాలలో మరణించినప్పుడు  

4.  కరెంట్ షాక్ వల్ల మరణించినప్పుడు  

5. వడదెబ్బ తగిలి మరణించినప్పుడు  

6. అగ్ని ప్రమాదాలలో మరణించినప్పుడు  

7. తుఫానులు, భూకంపాలు, ఉప్పెనలు వంటి ప్రకృతి విపత్తులలో మరణించినప్పుడు 

8. అల్లర్లు, ఉగ్రవాదుల దాడులలో మరణించినప్పుడు  

9. కుక్క కాటు వలన రెబీస్ వ్యాది సోకి మరణించినప్పుడు  

10. పాము కాటు లేదా వన్య మృగల దాడిలో మరణించినప్పుడు  

11. కల్లు గీత కార్మికులకు 

12. అత్యాచారానికి గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు ఈ పధకం వర్తిస్తుంది. కనుక ఇటువంటి ప్రమాదాలలో ఎవరైనా మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులు తక్షణమే ఈ పధకం కోసం దరఖాస్తు చేసుకొన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.50,000 ఆర్ధికసాయం అందజేస్తుంది. 

ఈ పధకానికి ఎవరు అనర్హులంటే... 

1. ఆత్మహత్య చేసుకొన్నవారికి 

2. మద్యం త్రాగి మరణించినవారికి 

3. సుఖ వ్యాదులతో మరణించినవారికి 

4. మానసిక రోగంతో మరణించినవారికి 

5. చట్టాన్ని ఉల్లంఘించి చనిపోయినవారికి 

6. ప్రసవసమయంలో చనిపోయిన మహిళలకు 

7. విధి నిర్వహణలో చనిపోయిన సాయుధబలగాలకు 

8. యుద్దం లేదా అణువిస్పోటనంలో చనిపోయిన వారికి ఈ పధకం వర్తించదు.