పోలీసుల ముందు హాజరైన రవిప్రకాశ్

టీవీ-9 న్యూస్ ఛానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. టీవీ-9 ఛానల్ కొత్త యాజమాన్యం అలందా మీడియా ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేయడంతో ఆయన గత 3 వారాలుగా అజ్ఞాతంలో ఉంటూ మొదట హైకోర్టులో ఆ తరువాత  సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు. కానీ వాటిని న్యాయస్థానాలు తిరస్కరించడంతో ఆయనకు వేరే మార్గం లేక పోలీసుల విచారణకు హాజరుకావలసి వచ్చింది. ఏసీపీ శ్రీనివాస్ కుమార్ నేతృత్వంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను నిన్న సాయంత్రం 6 నుంచి సుమారు 4 గంటల పాటు ప్రశ్నించారు. మళ్ళీ ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావలని వారు ఆదేశించారు.    

నిన్న రాత్రి విచారణ ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “టీవీ-9 న్యూస్ ఛానల్ ను ఇద్దరు ధనికులు దొడ్డిదారిలో స్వాధీనం చేసుకొన్నారు. నిబందనలకు విరుద్దంగా బోర్డు మీటింగ్ పెట్టుకొని నన్ను బలవంతంగా బయటకు సాగనంపారు. పైగా నాపై మూడు తప్పుడు కేసులు బనాయించారు. ఇది మాఫియాకు.. మీడియాకు మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం. అంతిమంగా దీనిలో జర్నలిజమే నెగ్గుతుందని నమ్ముతున్నాను,” అని రవిప్రకాశ్‌ అన్నారు.