నేటి నుంచే పంటపెట్టుబడి నగదు బదిలీ

వర్షాకాలం సమీపిస్తుండటంతో నేటి నుంచే రైతుబంధు పధకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనుక నేటి నుంచే రైతుల బ్యాంక్ ఖాతాలలో ఎకరాకు రూ.5,000 చొప్పున పంటపెట్టుబడి సొమ్మును వ్యవసాయశాఖ జమా చేస్తుందని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అయితే బ్యాంకుల వద్ద రద్దీ, ఒత్తిడి నివారించడానికిగాను మూడు నాలుగు విడతలలో బ్యాంకులకు నగదు బదిలీ చేస్తామని తెలిపారు. 

పట్టాదారు పాసుపుస్తకాలున్న 54.60 లక్షల మంది రైతులతో పాటు కొత్తగా పాసుపుస్తకాలు వచ్చినవారికి కూడా పంటపెట్టుబడి అందించబోతున్నామని తెలిపారు. అటవీభూములపై యాజమాన్య హక్కు ఉన్నవారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులుగా గుర్తించినందున వారికి కూడా ఈ పధకం కింద పంటపెట్టుబడి అందించబోతున్నట్లు తెలిపారు. ఈ ఖరీఫ్ సీజనులో పంటపెట్టుబడికి మొత్తం రూ.6,900 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో రైతులందరికీ పంటపెట్టుబడి సొమ్ము చేతికి అందేలా నగదు బదిలీలు జరుగుతాయని తెలిపారు. ఒకవేళ ఏ కారణం చేతైనా అర్హులైన రైతులకు పంటపెట్టుబడి సొమ్ము అందకపోతే ఆందోళన చెందనవసరంలేదని, స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే సమస్య పరిష్కరించబడుతుందని తెలిపారు.