
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో పార్టీని ప్రకటిస్తామని ఆమె చెప్పారు. కానీ పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో ఆమెకు సమస్యలు ఎదురవుతున్నాయి. కనుక ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. వీలైనంత త్వరగా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రకియ ముగించాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ని ఆదేశించవలసిందిగా కోరుతూ ఆమె పిటిషన్ వేశారు.
ఈ కోర్టు కేసు మొదలై అప్పుడే నెలరోజులవుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె పిటిషన్‌పై ఫిభ్రవరి 27న ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈసీ తరపు న్యాయవాది వాదిస్తూ ‘ఆమె సమర్పించిన దరఖాస్తులో అనేక తప్పులున్నాయని వాటిని సరిచేసి మళ్ళీ సమర్పించాలని కోరామని న్యాయస్థానానికి తెలియజేశారు. నేడు ఈ కేసు విచారణ చేపట్టబోతోంది.
పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కూడా ఆమె న్యాయపోరాటం చేయడం చూస్తుంటే తెలంగాణ సాధన కోసం మొదలుపెట్టిన పోరాటాలు ఎన్నటికీ ఆగేలా లేవనిపిస్తుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని తాజా సమాచారం.