
జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజులలోనే వివిదవర్గాల ప్రజలు, ఉద్యోగులపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డి, ఈనెల 1వ తేదీ నుంచి ఆశా వర్కర్ల జీతాలు నెలకు రూ.10,000కు పెంచాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో పాల్గొన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఆశా వర్కర్లు తమ గోడు మొరపెట్టుకొన్నారు. నెలకు రూ.3,000 జీతంతో దయనీయమైన జీవితాలు గడుపుతున్న తమను ఆదుకోవాలని కోరగా తాను అధికారంలోకి రాగానే వారి జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 3వ రోజే వారికి ఒకేసారి ఏకంగా నెలకు రూ.7,000 జీతాలు పెంచి ఆ హామీని నిలబెట్టుకొన్నారు. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖను ఇకపై స్వయంగా చూసుకొంటానని చెప్పడంతో ఆ శాఖను ఆయనే అట్టేబెట్టుకొంటారని స్పష్టం అవుతోంది.