
రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం పూర్తయింది. మూడు జిల్లాలలో తెరాస అభ్యర్ధులు విజయం సాధించారు. వరంగల్ నుంచి తెరాస అభ్యర్ధిగా పోటీ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి చిన్నప్పరెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి విజయం సాధించారు.
స్థానిక సంస్థల సభ్యులలో తెరాసకు చెందిన సభ్యులే ఎక్కువ మంది ఉన్నందున తెరాస అభ్యర్ధుల గెలుపు లాంఛనప్రాయమేనని ముందే ఊహించారు. ఊహించినట్లుగానే ముగ్గురు తెరాస అభ్యర్ధులు గెలిచారు. అయితే నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భార్య ఓటమి ఆయనకు షాక్ అనే చెప్పవచ్చు. ఎంపీగా గెలిచిన ఆయన ఈ ఎన్నికలలో తన భార్యను గెలిపించుకొని నల్గొండ జిల్లాపై తన పట్టు నిలుపుకొందామని భావించారు. కానీ ఆమె ఓటమితో ఎదురుదెబ్బ తగిలింది. అలాగే లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తిన్న తెరాసకు ఇది చాలా ఉపశమనం కలిగించేదేనని చెప్పవచ్చు.