హైదరాబాద్‌లో ఏపీ భవనాలు తెలంగాణకు బదిలీ

రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేటాయించిన భవనాలను తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు రెండేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వోద్యోగులు అమరావతికి తరలివెళ్ళిపోయినప్పటి నుంచి అవన్నీ నిరుపయోగంగా ఉండిపోయాయి. పైగా వాటిపై విద్యుత్, ఆస్తిపన్ను బకాయిలు సుమారు రూ.8 కోట్లు పేరుకుపోయాయి. వాటిని ఇంకా అలాగే వదిలేస్తే శిధిలావస్థకు చేరుకోవచ్చు కనుక వాటిని తిరిగి తమకు అప్పగించాలని సిఎం కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తిపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరూ సానుకూలంగా స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బకాయిపడ్డ రూ.8 కోట్లను మాఫీ చేయాలని జగన్ కోరారు. అందుకు సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. అయితే నేటికీ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్నందున ఏపీ ప్రభుత్వ అవసరాల కోసం రెండు భవనాలను కేటాయించాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచనలకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించడంతో ఏపీ ప్రభుత్వం అధీనంలో ఉన్న భవనాలను, కొన్ని భవనాలలో బ్లాకులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. 

ముఖ్యమంత్రుల మద్య పంతాలు పట్టింపులు రాజకీయవైరాల కారణంగా గత 2-3 ఏళ్లుగా పరిష్కారం కానీ ఈ సమస్య ఇప్పుడు ఇరువురు ముఖ్యమంత్రుల మద్య సఖ్యత ఏర్పడటంతో కేవలం 5 నిమిషాలలో పరిష్కారం అయిపోయింది. ఇక ముందు కూడా రెండు రాష్ట్రాలు ఇదేవిధంగా పరస్పరం సహకరించుకొంటూ అభివృద్ధిపధంలో ముందుకు సాగాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు.   

తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించబడుతున్న భవనాలు: 

సచివాలయంలోని నార్త్ బ్లాకులోని ఐ, జె మరియు సౌత్ బ్లాకులోని హెచ్‌, కె భవనాలు  

లక్డీకపూల్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయం

ఎర్రమంజిల్‌, మలక్‌పేట, మాదన్నపేటల్లోని ప్రభుత్వ క్వార్టర్లు

నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు, ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ భవనాలు

నాంపల్లి సీసీఎల్‌ఏ కార్యాలయం, వక్ఫ్‌ బోర్డు కార్యాలయం

ఖైరతాబాద్‌లోని విద్యుత్తు సౌధ

కోఠిలో ఏపీ వైద్య విధాన పరిషత్‌

దామోదరం సంజీవయ్య భవన్‌లో సగం అంతస్తులు

పంచాయతీరాజ్‌, నీటి పారుదల శాఖ భవనాల్లో సగం అంతస్తులు

బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో సగం అంతస్తులు

ఏసీ గార్డ్స్‌లోని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేసన్‌ భవనం

మాసబ్‌ ట్యాంక్‌లోని ఇన్ఫర్మేషన్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ భవనం

,మాసబ్‌ ట్యాంక్‌లోని ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ భవనం

నారాయణగూడలోని సర్వే సెటిల్‌మెంట్‌ కార్యాలయం

హాకా భవన్‌లోని సగం అంతస్తులు

సెర్ప్‌ భవనంలోని సగం అంతస్తులు

ఏపీ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌