ఉత్తమ్ రాజీనామాకు ముహూర్తం ఖరారు

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 3వ తేదీన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకొన్నారు. హుజూర్‌నగర్‌ నుంచి శాసనసభకు ఎన్నికైన ఆయన ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నల్గొండ నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. కనుక త్వరలోనే హుజూర్‌నగర్‌ స్థానానికి ఉపఎన్నికలు జరుగనున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించినప్పటికీ, లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తినడంతో మళ్ళీ తన సత్తా చాటుకొనేందుకు హుజూర్‌నగర్‌ స్థానాన్ని దక్కించుకొనేందుకు గట్టిగా ప్రయత్నించడం ఖాయం. అలాగే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో 4 సీట్లు గెలుచుకొని విజయోత్సాహంతో ఉన్న బిజెపి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలు కంటోంది కనుక ఆదివారం కూడా హుజూర్‌నగర్‌ను దక్కించుకొనేందుకు ఈసారి గట్టిగా ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఆ రెండు పార్టీలలో ఏదైనా హుజూర్‌నగర్‌ను కైవసం చేసుకొన్నట్లయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేతిలో నుంచి మరొక ఎమ్మెల్యే సీటు చేజారిపోయినట్లవుతుంది.